Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page

2. ప్రకాశకుల నివేదన

శ్రీకంచి కామకోటి పరమాచార్య మెమోరియల్‌ ట్రస్ట్‌ 1996లో స్థాపించబడింది. కంచి మహాస్వామివారికి ఇష్టములైన కార్యక్రమములను చేపట్టుట ఈ సంస్థ ముఖ్యోద్దేశ్యము.

మహాస్వామివారికి శ్రీశైలక్షేత్రమన్న ఒక ప్రత్యేక ఆదరము,. అభిమానము. స్వామివారు శ్రీశైల పర్యటనలో ఆ ప్రాంతములలోని కొండలు, గుహలు, దేవాలయములు పాదాచారులై తిరుగాడుచూ ఆదిశంకరులు తపస్సు చేసిన హాటకేశ్వర మహాపుణ్యస్థలముతో సహా అనేక స్థలములను నిర్దేశించారు. దక్షిణాదిన ఉన్న రెండు ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రములలోని రామేశ్వరములో అగ్ని తీర్ధము కెదురుగా ఆదిశంకర మంటపము నిర్మాణములో యున్నప్పుడే మహాస్వామివారికి ఆదిశంకరులకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రములలో కూడా ఆదిశంకర మంటప నిర్మాణము జరగవలెనన్న సంకల్పము కలిగినది. ఆ సంకల్ప స్వరూపమే ఈనాడు శ్రీశైలమున ఉన్న కంచి కామకోటి ఆదిశంకర మంటపము. శ్రీమదాది శంకర భగవత్పాదులు శిష్యసమేతులై ఇచ్చట ప్రతిష్టించబడినారు.

కంచికామకోటి పీఠ శ్రీశైల శంకర మంటపపు యాజమాన్యమును స్వీకరించినదాదిగా ఈ సంస్థ పదిహేను మంది విద్యార్థులకు ఋగ్యజుర్వేదములలోనూ, స్మార్తము నందునూ శిక్షణ నిచ్చెడి ఏర్పాట్లు, విద్యార్థుల భోజనవసతి ఏర్పాట్లు చూచుచున్నది. గోశాల నిర్వహించుచున్నది. ఇవి స్వామివారికి ప్రీతికరములైన కార్యములు.

ఈ ప్రాంగణమున శ్రీసుబ్రహ్మణ్య, శ్రీవిఘ్నేశ్వర దేవాలయములున్నవి. ఆదిశంకరుల విగ్రహముతో పాటు అక్కడనూ నిత్యార్చనలు జరుగుతున్నవి. ఇదికాక శ్రీకాంచి పీఠాధిపతులు మరియు శ్రీజనార్దనానంద స్వామివారి ఆదేశ పర్యవేక్షణములలో రుద్రహోమ, చండీహోమ, పాశుపత రుద్రాభిషేకములు సూచించబడిన క్రమము తప్పకుండా నిర్వహించబడుచున్నవి.

మహాస్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీశైలక్షేత్రములో మహాస్వామివారి కాంస్య విగ్రహము శ్రీమజ్జయేంద్ర సరస్వతీ సంయమీంద్రుల కరకమలములచే 2.5.2001 న ఆవిష్కరించబడినది. తదాదిగా అచట నిత్యపూజలు అత్యంత వైభవోపేతముగా జరుగుచున్నవి.

ఈ సంస్థ ముఖ్యోద్దేశ్యములలో ఒకటైన ఆధ్యాత్మిక పుస్తక ప్రచురణలో భాగంగా ఇప్పుడు శ్రీ చల్లా విశ్వనాధ శాస్త్రిగారిచే విరచించబడిన భారతీయ సమైక్యతామూర్తి - ఆది శంకరులు అనెడి విశ్లేషణాత్మకమైన శంకర చరితము ప్రచురించుటకు ఎంతో ఆనందించుచున్నాము. గ్రంధకర్తకు, భక్తిశ్రద్దలతో D.T.P. ఉచితముగ చేసిపెట్టిన చల్లా సురేష్‌ దంపతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ప్రసాదించ వలసినదిగా మహాస్వామివారిని ప్రార్థించుచున్నాను.

సముద్రాల కృష్ణమూర్తి

హైదరాబాదు శ్రీ కంచికామకోటి పరమాచార్య మెమోరియల్‌ ట్రస్ట్‌

26-07-2002 మేనేజింగ్‌ ట్రస్టీ

Bharatiya Samaikyatha Murthy    Chapters    Last Page